కరోనా ఎవ్వర్ని వదలడం లేదు. థండర్ సీజన్‌లో కూడా థర్డ్‌వేవ్ దడ పుట్టిస్తోంది. వైరస్ సోకడంతో మహామహులు మంచాన పడుతున్నారు. ఫిలింఇండస్ట్రీ కు చెందిన చాలా మంది వైరస్ బారినపడుతున్నారు. తాజాగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కి మరోసారి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఈవిషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గతంలో కూడా బండ్ల గణేష్‌కు రెండు సార్లు కరోనా సోకింది. థర్డ్‌వేవ్‌లో కూడా వైరస్ ఆయన్ని వదల్లేదు. రెండోసారి కరోనా వచ్చినప్పుడు ఆయనకు హాస్పిటల్‌లో బెడ్ కూడా దొరకని పరిస్థితి తలెత్తింది. మూడోసారి తనకు పాజిటివ్ వచ్చిందని..గత మూడ్రోజులుగా ఢిల్లీ లో ఉన్నానని ఆదివారం సాయంత్రం హైదరాబాద్ వచ్చినట్లు బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా ఈవిషయాల్ని వెల్లడించారు. పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని..అయితే తన కుటుంబ సభ్యుల్లో ఎవరికి కరోనా సోకలేదని..టెస్ట్‌లు చేయిస్తే అందరికి నెగిటివ్వ చ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్న బండ్ల గణేష్ స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న వీడియోని కూడా ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు బండ్ల గణేష్.
ప్రయాణాల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు గణేష్. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సలహా ఇచ్చారు. కరోనా ప్రభావం పూర్తిగా పోలేదని..అంతా అప్రమత్తంగా ఉంటేనే మంచిదని పదే పదే సెలబ్రిటీలు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరకు సినీ, రాజకీయ ప్రముఖులే కరోనా బారినపడుతున్న ఇలాంటి సమయంలోనైనా అంతా జాగ్రత్తగా ఉంటే మంచిది.